కలెక్టరేట్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఆంధ్రప్రభ): నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శనివారం ఉదయం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు వందనం చేసిన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. నాగర్కర్నూల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందిస్తూ పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వందేమాతరం గీతాలు ఆలపించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించి వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
