అత్యుత్తమ సేవలకు కేంద్ర పురస్కారం..

  • డీసీపీ పి. వెంకట రమణకు రాష్ట్రపతి పోలీస్ మెడల్
  • మెరిటోరియస్ సర్వీస్‌కు జాతీయ గుర్తింపు

కరీంనగర్, క్రైం : కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణకు పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలకు గాను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ లభించింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్ జాబితాలో ఆయన పేరు చోటు దక్కించుకుంది.

1991లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేరిన వెంకట రమణ 34 ఏళ్లుగా నిబద్ధతతో సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌ ట్విన్‌ సిటీస్‌లో టాస్క్‌ఫోర్స్‌, మతపరంగా సున్నితమైన ప్రాంతాలు, ట్రాఫిక్‌, ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌ తదితర విభాగాల్లో విధులు నిర్వహించారు.

2005లో ఇన్‌స్పెక్టర్‌గా, 2017లో ఏసీపీగా, 2025 మేలో అదనపు ఎస్పీగా పదోన్నతులు పొందారు. గత ఏడాది జూన్‌ 2 నుంచి కరీంనగర్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎస్‌ఐగా పనిచేసిన సమయంలో మాండ్రక్స్‌ కేసులు, నకిలీ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాలు, అక్రమ ఆయుధాల కేసులను ఛేదించారు. జడ్చర్ల ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో హత్యలు, హైవే దోపిడీలు, సామూహిక అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టారు.

తన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే తెలంగాణ పోలీస్ సేవా పతకం-2010, ఉత్తమ సేవా పతకం-2018, కేంద్ర హోం మంత్రి పతకం-2022తో పాటు 107 నగదు బహుమతులు, 162 జీఎస్‌ఈలు అందుకున్నారు.

క్రమశిక్షణ, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజల భద్రత పట్ల అంకితభావంతో పనిచేసినందుకు పి. వెంకట రమణకు ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించడంపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.