గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు కీలకం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని సీఐ పులి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీసీ కెమెరాల ద్వారా గ్రామాల్లో జరిగే ముఖ్యమైన కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తులో సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయం ఏర్పడి, నేరాల నియంత్రణకు దోహదపడుతుందని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు, పోలీసులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల్లో భద్రతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
