ఓటర్ల వివరాలపై విచారణ
- 779 మందిని పరిశీలించిన అధికారులు
- సెప్టెంబరు 21 వరకు విచారణ..
- వివరాల ధ్రువీకరణకు పత్రాలు సమర్పించాలని సూచన
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నో మ్యాపింగ్ ఓటర్లు, ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి జారీ చేసిన నోటీసులపై బుధవారం ఉరవకొండలో తహసీల్దార్ అరుణ విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, నో మ్యాపింగ్ అంశాలకు సంబంధించి సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఉరవకొండ పరిధిలో నో మ్యాపింగ్ ఓటర్లు 4,917 మంది ఉండగా, ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారు 41,289 మంది ఉన్నారని వెల్లడించారు. మొత్తం 46,206 మంది ఓటర్లకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న ఉరవకొండ మండలానికి చెందిన 779 మంది ఓటర్లను విచారించి, వారి వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను బీఎల్వో యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ విచారణ ప్రక్రియను సెప్టెంబరు 21వ తేదీ వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ తేదీన తప్పనిసరిగా హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు. 2002 నాటి ఓటర్ల డేటా, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, జనన తేదీ ధ్రువపత్రం తదితర ఆధారాలను తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్, బీఎల్వోలు పాల్గొన్నారు.
