మేడిగడ్డ కేసులో కేసీఆర్‌కు మరోసారి సమన్లు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమన్లు ఇంకా అందకపోవడంతో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసింది.

మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారానికి సంబంధించి రాయలింగమూర్తి దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అసలు పిటిషనర్‌ మరణించినప్పటికీ విచారణను కొనసాగించవచ్చని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో కేసు విచారణను జిల్లా కోర్టు కొనసాగిస్తోంది.

కేసీఆర్‌కు సమన్లు అందలేదని..

ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గతంలో జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో ఆయనకు మరోసారి సమన్లు పంపే చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణకు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధుల తరఫు న్యాయవాదులు, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన అంశాలపై వాదనలు కొనసాగాయి.

సెప్టెంబర్‌ 9న ఏం జరుగుతుందో?

విచారణ అనంతరం కేసును సెప్టెంబర్‌ 9కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కేసీఆర్‌కు సమన్లు అందడం, తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో.. కేసు విచారణ ఏ దిశగా సాగుతుందనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.