డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఏడుగురికి జైలు

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి ఐదు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధిస్తూ ఆర్మూర్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెలువరించినట్లు కమ్మర్‌పల్లి ఎస్‌ఐ చిర్ర సతీష్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విస్తృతంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురిపై కేసులు నమోదు చేసి, ఆర్మూర్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.

నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడుగురికి ఐదు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ వివరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జైలు శిక్షతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సతీష్‌ స్పష్టం చేశారు.