దేశభక్తి, జాతీయస్ఫూర్తే… హర్ ఘర్ తిరంగా లక్ష్యం: ప్రత్తిపాటి

  • చిలకలూరిపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
  • ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్తిపాటి

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయఐక్యత పెంపొందించేలా, నేటి యువతకు భారతదేశ కీర్తి, ప్రతిష్టలు ఔన్నత్యం తెలియచేసేలా భారత, రాష్ట్ర ప్రభుత్వాలు సగర్వంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.

బుధవారం ఆయన చిలకలూరిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్ధానిక రైతు బజార్ వద్ద జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ప్రత్తిపాటి, ప్రజలతో కలిసి ఎన్టీఆర్ కూడలి వరకు ముందుకు సాగారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.

మోదీ నాయకత్వంలో భారత్… చంద్రబాబు నిర్దేశకత్వంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని యువతలో దేశభక్తిభావాన్ని, అమరవీరుల త్యాగస్ఫూర్తిని నింపేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. ప్రతి భారతీయుడిలో జాతీయ భావం పెంపొందాలి.. దేశం పట్ల గౌరవం, భక్తిభావం పెరగాలనే సదాశయంతో ప్రభుత్వాలు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు.

భిన్నమతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతి సంప్రదాయాల కలబోత అయిన భారతదేశం… నేడు మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, అలానే చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తూ, దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనలో భాగంగా చంద్రబాబు నిర్దేశకత్వంలో ఏపీ ఉన్నత లక్ష్యాల సాధన దిశగా దూసుకెళ్తోందన్నారు.

రాష్ట్ర యువత, నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతోనే కూటమిప్రభుత్వం రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందన్నారు. పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే.. అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ఏపీ దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుల స్ఫూర్తితో, నేటి యువత తమ జీవిత లక్ష్యాలను సాధించుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.

కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, షేక్ మస్తాన్ వలి, ముద్దన నాగేశ్వరరావు, కొత్త కోటేశ్వరరావు, అమరా రమాదేవి, కూటమి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.