2-08-Lakh-Crore : ఏపీకి భారీ పెట్టుబడుల వరద ! Andhra Prabha Top Story
2-08-Lakh-Crore : ఏపీకి భారీ పెట్టుబడుల వరద ! Andhra Prabha Top Story
- రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఓకే
- 21,627 మందికి ఉద్యోగాలు..!
- ఏపీలో 25 భారీ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
- 21,627 మందికి ఉద్యోగాలు గ్యారంటీ
- పల్లెల ప్రగతికి పారిశ్రామిక ప్రాజెక్టులు
- డిఫెన్స్ నుంచి డేటా సెంటర్ల వరకు..!
(అమరావతి, ఆంధ్రప్రభ)

ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సీఎం సూచించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్‌లు తప్పనిసరి అయినా ఎంత వరకూ ఆ ప్రోత్సాహకాలను ఇవ్వగలమన్న అంశంపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పారిశ్రామిక ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అయ్యింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,08,406 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదాన్ని తెలియచేసింది. తద్వారా 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా 363 ప్రతిపాదనల ద్వారా రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం దక్కింది. ఈ పెట్టుబడుల ద్వారా 10.86 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ అమ్మోనియాతో పాటు లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో పరిశ్రమల్ని ప్రోత్సహించేలా ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. కొందరు పనిగట్టుకుని కాలుష్యకారకాలంటూ
దుష్ప్రచారం చేస్తున్నారని అసత్యాలను నమ్మించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లన్నిటికీ 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని అన్నారు. డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై విశాఖలోని పరిశ్రమలకు పుష్కలంగా నీటిని తీసుకెళ్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వస్తున్న పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని ఎకోసిస్టమ్‌కు ఎంత విలువ జోడిస్తున్నామన్న అంశాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏపీకి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఆతిథ్య రంగంలో వస్తున్న హోటల్ భవనాలు ప్రత్యేక నిర్మాణాలుగా ఉండేట్టు చూడాలని అన్నారు.
2-08-Lakh-Crore : 175 ఎంఎస్ఎంఈ పార్కులు

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులన్నీ జాతికి గర్వకారణమేనని సీఎం స్పష్టం చేశారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్సు, హిందుపూర్ సమీపంలో ఏరో స్పేస్ ప్రాజెక్టులు రావాలని సీఎం నిర్దేశించారు. మూలపేట పోర్టు డిసెంబరులో ప్రారంభించేలా నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఆధునిక వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను అనుసంధానించాలని అన్నారు. రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లేలా రోడ్ రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండాలన్నారు. గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపీబీలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను కూడా పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి రావాలన్నారు. వన్ ఫ్యామిలీ- వన్ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం నిర్దేశించారు.
- 20వ ఎస్ఐపీబీ భేటీలో ప్రాజెక్టుల వివరాలు*
- 1.ఓకెయిర్ గ్రీన్ ఫ్యూయెల్స్ కర్నూలు జిల్లాలో రూ.616 కోట్ల పెట్టుబడి, 130 మందికి ఉద్యోగాలు
2.జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్ కర్నూలు జిల్లాలో రూ.1533 కోట్ల పెట్టుబడి, 250 మందికి ఉద్యోగాలు
3.ఎఫ్ పీఈఎల్ రవ్వేద పవర్ , విజయనగరం జిల్లాలో రూ.480 కోట్ల పెట్టుబడి, 275 మందికి ఉద్యోగాలు
4.వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, కాకినాడ జిల్లాలో రూ.15000 కోట్ల పెట్టుబడి, 1500 మందికి ఉద్యోగాలు
5.ఆరాద్యా బయోగ్యాస్ , కర్నూలు జిల్లాలో రూ.143.47 కోట్ల పెట్టుబడి, 595 మందికి ఉద్యోగాలు
6.ఉషోదయా బయోగ్యాస్, నెల్లూరు జిల్లా, రూ.143.47 కోట్ల పెట్టుబడి, 595 మందికి ఉద్యోగాలు
7.డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా, విశాఖపట్నం, రూ.58,743 కోట్లు, 1250 మందికి ఉద్యోగాలు
8.మునోథ్ లీథియం బ్యాటరీ లిమిటెడ్, తిరుపతి జిల్లాలో రూ.500 కోట్ల పెట్టుబడి, 240 మందికి ఉద్యోగాలు
9.ఏఐఎల్ డిక్సన్ ఇండియా లిమిటెడ్, కడప జిల్లా కొప్పర్తి క్లస్టర్ లో, రూ.450 కోట్ల పెట్టుబడి, 7000 మందికి ఉద్యోగాలు
10.రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్, అనకాపల్లి జిల్లా, రూ.85,200 కోట్ల పెట్టుబడి, 1880 మందికి ఉద్యోగాలు
11.ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖ జిల్లా, రూ.31,387 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు
12.సీఆర్ఆర్ హాస్పిటాలిటీ ఎల్ఎల్ పీ, తిరుపతి జిల్లాలో రూ.192.02 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు
13.ఆర్కే 2 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తిరుపతి జిల్లా లో రూ.150 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు
14.సన్ రైజ్ హోటల్స్ ఇండియా లిమిటెడ్, కాకినాడ జిల్లాలో రూ.54 కోట్ల పెట్టుబడి, 75 మందికి ఉద్యోగాలు
15.జెఎస్పీ హోటల్స్, రిసార్ట్స్ ఎల్ఎల్ పీ, కృష్ణా జిల్లాలో రూ.63.79 కోట్ల పెట్టుబడి, 100 మందికి ఉద్యోగాలు
16.పావులూరి హోటల్స్, తిరుపతి జిల్లా, రూ.58.74 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు
17.అగస్త్యా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, కర్నూలు జిల్లాలో రూ.7799.96 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు
18.అక్షత్ గ్రీన్ టెక్ లిమిటెడ్, విశాఖపట్నం జిల్లా రూ.1600 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉద్యోగాలు
19.కోరమాండల్ ఇంటర్నేషనల్, శ్రీకాకుళం జిల్లా, మూలపేట, రూ.2125 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు
20.హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.880 కోట్ల పెట్టుబడి, 447 మందికి ఉద్యోగాలు
21.ఎస్ట్రేలా లాజిస్టిక్స్ , విశాఖపట్నం జిల్లాలో రూ.90 కోట్లు,100 మందికి ఉద్యోగాలు
22.గణేష్ సాయి మౌనిష స్టీల్ వైర్స్, విజయనగరం జిల్లాలో రూ.66 కోట్ల పెట్టుబడి, 120 మందికి ఉద్యోగాలు
23.వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , నెల్లూరు జిల్లా, మనుబోలు, రూ.500 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ఉద్యోగాలు (ప్రైవేట్ పార్క్)
24.జయాదిత్యా ఆగ్రో లిమిటెడ్, కర్నూలు జిల్లాలో రూ.300 కోట్లు పెట్టుబడి, 350 మందికి ఉద్యోగాలు
