సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సు
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి..
అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దు
వాజేడు, ఆంధ్రప్రభ : పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్‌ఐ గుర్రం కృష్ణప్రసాద్ గ్రామస్థులకు ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, డెబిట్ కార్డు వివరాల దుర్వినియోగం, నకిలీ లింకులు, సామాజిక మాధ్యమాల మోసాలు, యూపీఐ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, వాట్సాప్ సందేశాలు లేదా అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. ఎవరికీ ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ నేరాల సహాయవాణి 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, సంబంధిత బ్యాంకును కూడా వెంటనే సంప్రదించాలని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరాలను గణనీయంగా నివారించవచ్చని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఏదైనా అనుమానాస్పద ఆన్‌లైన్ లావాదేవీ జరిగినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైబర్ నేరాల నివారణకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలను తెలుసుకున్నారు.
