దక్షిణాసియా రాక్‌బాల్ విజేత గోపాల్ యాదవ్‌కు అభినందనలు

దేశానికి, రక్షణ సేనకు గర్వకారణం: కల్వకుంట్ల కవిత

మేడ్చల్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన దక్షిణాసియా రాక్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి విశేషంగా కృషి చేసి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన మేడ్చల్ జిల్లా పూడూరు పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఇటబోయిన గోపాల్ యాదవ్ బుధవారం తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గోపాల్ యాదవ్‌ను కవిత శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయ సాధనలో భాగస్వామి కావడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.

తెలంగాణ యువత క్రీడారంగంలో రాణిస్తూ దేశానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో గోపాల్ యాదవ్ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించి దేశ కీర్తిపతాకాన్ని ఎగరవేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సేన మహిళా అధ్యక్షురాలు వనజ, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ గండికోట కుమార్, పట్టణవాసులు శ్రీపాల్ యాదవ్, కిరణ్, సాయిబాబు, చిత్తారి తదితరులు పాల్గొన్నారు.