పాఠశాలలో విషసర్పం కలకలం
ప్రహరీ లేక తరగతి గదిలోకి పాము..
ఉపాధ్యాయుడి అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
మరిపెడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో ఓ విషసర్పం తరగతి గదిలోకి ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ధైర్యంగా పామును చంపడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన సమయస్ఫూర్తి, అప్రమత్తతతో ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో పాములు, ఇతర విషపురుగులు ఆవరణలోకి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వర్షాకాలంలో విషసర్పాల సంచారం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతున్నారు.
తరగతి గదులను ప్రతిరోజూ శుభ్రపరచడంతో పాటు పాములు దాగి ఉండే ప్రాంతాలను గుర్తించి తొలగించాలని సూచిస్తున్నారు.
విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లే సమయంలో పరిసరాలను పరిశీలించేలా అవగాహన కల్పించాలని తల్లిదండ్రులు కోరారు.
