ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, వినతులు, అభ్యర్థనలను స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక, అభివృద్ధి సంబంధిత అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని ఓపికగా విన్న మంత్రి.. సమస్యల తీవ్రత, పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

అధికారులతో సమన్వయం.. తక్షణ చర్యలకు ఆదేశాలు
ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌ బాబు.. అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల అధికారులతో నేరుగా మాట్లాడారు. సమస్యల వివరాలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు.