విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ తరగతులు నిర్వహించేలా చర్యలు
మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురలో ఖాళీగా ఉన్న మొదటి అంతస్తును వినియోగంలోకి తీసుకొని, మల్లేపల్లి డిగ్రీ కళాశాల తరగతులను తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. కళాశాల భవనం, తరగతి గదులు, ఖాళీగా ఉన్న మొదటి అంతస్తును పరిశీలించారు.
మల్లేపల్లి డిగ్రీ కళాశాలకు దూరం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు కళాశాలకు హాజరు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా మహిళా విద్యార్థులు రాకపోకల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిన విషయాన్ని వెల్లడించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మల్లేపల్లి డిగ్రీ కళాశాల తరగతులను తాత్కాలికంగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఖాళీగా ఉన్న మొదటి అంతస్తులో నిర్వహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులకు విద్యాభ్యాసంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను సమన్వయంతో కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసిల్దార్ ఆరిపోద్దిన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
