వీధిలైట్‌ పనుల్లో విద్యుత్‌ షాక్‌.. కార్మికుడికి తీవ్ర గాయాలు

పోల్‌పై నుంచి కిందపడి తలకు బలమైన గాయాలు..

మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలింపు

కొత్తగూడెం టౌన్‌, ఆంధ్రప్రభ: వీధిలైట్‌ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై పోల్‌పై నుంచి కిందపడటంతో ఓ టెంపరరీ వర్కర్‌ తీవ్రంగా గాయపడిన ఘటన కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోని 23వ వార్డు మంగపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు.

మంగపేటకు చెందిన భూక్య జయరాం (47) సుమారు 11 ఏళ్లుగా టెంపరరీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ సంబంధిత పనుల్లో భాగంగా వీధిలైట్‌ పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్‌ లైన్‌ తగలడంతో షాక్‌కు గురైనట్లు సమాచారం. దీంతో అదుపుతప్పి పోల్‌పై నుంచి సీసీ రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఆయన తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. నోటి నుంచి, ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంలోని మమత ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్‌ పనులు చేపట్టే సమయంలో భద్రతా చర్యలు తీసుకున్నారా, విద్యుత్‌ సరఫరా నిలిపివేశారా, అవసరమైన రక్షణ పరికరాలు అందించారా అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.