పురావస్తు సంపద పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
- మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన రేవు ముత్యాలరాజు
- చారిత్రక కట్టడాలు, శాసనాలు, పురాతన కళాఖండాలను భావితరాలకు భద్రపరచాలి
- మ్యూజియంల ఆధునీకరణకు చర్యలు
- పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: రాష్ట్ర పురావస్తు శాఖ, మ్యూజియంలకు కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు బుధవారం సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న చారిత్రక, పురావస్తు సంపద, ప్రాచీన కట్టడాలు, శాసనాలను భావితరాల కోసం భద్రపరచి పరిరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖపై ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలను ఆధునీకరించి, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర వైభవాన్ని చాటిచెప్పే పురాతన కళాఖండాలను పరిరక్షించడంలో ఆర్కియాలజీ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.
పురావస్తు ప్రదేశాలు, చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు వాటి ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రి దుర్గేష్ సూచనలపై కమిషనర్ రేవు ముత్యాలరాజు స్పందిస్తూ.. రాష్ట్రంలోని పురావస్తు సంపద పరిరక్షణకు, మ్యూజియంల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు.
