భూపాలపల్లిలో హర్‌ ఘర్‌ తిరంగా భారీ ర్యాలీ

300 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన..

జాతీయతా భావం పెంపొందించడమే లక్ష్యం: కీర్తిరెడ్డి

భూపాలపల్లి టౌన్‌, ఆంధ్రప్రభ: 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సుమారు 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, మేధావులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో జాతీయతా భావాన్ని పెంపొందించడమే హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. మనమంతా భారతీయులమనే భావనతో దేశంపై విశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు. జాతీయ జెండా కింద ప్రజలంతా ఐక్యంగా ఉంటే దేశాన్ని ఏ శక్తీ ఓడించలేదన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను అందుబాటులోకి తెచ్చిందని, గ్రామాల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికీ జెండాలు అందించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నం యుగంధర్‌, ఎరుకల గణపతి, జిల్లా అధ్యక్షుడు నిశిదర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు పాల్గొన్నారు.