కన్నబిడ్డను కాపాడి..

మృత్యువాత పడ్డ తండ్రి

మంథని టౌన్ ఆంధ్రప్రభ: ప్రమాదవశాత్తు బొక్కల వాగులో పడి గొర్ల కాపరి పర్షవేణ రాజు మృతి చెందిన విషాద ఘటన బుధవారం మంథని పట్టణంలో చోటుచేసుకుంది.

మంథని మున్సిపల్‌ పరిధిలోని బోయినిపేటకు చెందిన పర్షవేణ రాజు గొర్ల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా గొర్లను బొక్కల వాగు దాటిస్తున్న సమయంలో ఆయన కుమార్తె ప్రమాదవశాత్తు వాగులో పడింది. దీంతో కుమార్తెను కాపాడేందుకు రాజు వాగులోకి దూకాడు.

కుమార్తెను కాపాడినప్పటికీ రాజు వాగులో మునిగి మృతి చెందాడు. నవమాసాలు మోసి కన్న కూతురిని ప్రమాదం నుంచి కాపాడి తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో బోయినిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న మంథని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.