చలపల్లిలో ఘనంగా వరుణ కటాక్ష యాగం
సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు.. పాల్గొన్న టీడీపీ నేత విక్కుర్తి శ్రీనివాసరావు
చలపల్లి, ఆంధ్రప్రభ: చలపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వరుణ కటాక్ష యాగం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, వేదపండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరుణ దేవుడికి పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తొలుత శ్రీ లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయం ప్రకృతి, వర్షపాతంపై ఆధారపడి ఉంటుందని, సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కాలువలు, జలాశయాలు నీటితో నిండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, ప్రశాంతతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
