కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్
తండాల నుంచి అసెంబ్లీ వరకు.. గిరిజనుల పక్షాన పోరాడతాం: హరీష్ రావు
గిరిజనులకు అన్యాయం జరుగుతోంది
రూ.2730 కోట్ల కేటాయింపులు ఏమయ్యాయి?..
తండాలను పంచాయతీలుగా మార్చాం..
గిరిజనుల అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేసింది: హరీష్ రావు
సిద్ధిపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం కొనసాగించడం లేదని విమర్శించారు. సిద్ధిపేటలో నిర్వహించిన ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ అవేర్నెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గిరిజనుల సంక్షేమం, ఉపాధి, భూముల సమస్యలపై ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. గిరిజనుల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో తమ పార్టీ పోరాడుతుందని హరీష్ రావు అన్నారు. గిరిజనులకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
గిరిజనుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు
గిరిజన మహిళా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల రిజర్వేషన్లను పెంచినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 6 శాతంగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను తెలంగాణలో 10 శాతానికి పెంచామని చెప్పారు. అలాగే 3300 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినట్లు వివరించారు. పోడు భూముల సమస్య పరిష్కారంలో భాగంగా సుమారు 6 లక్షల ఎకరాలకు పట్టాలు అందించామని, గిరిజన రైతులకు మూడు దశల విద్యుత్, రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా నిలిచామని హరీష్ రావు తెలిపారు.
ఎస్టీ కార్పొరేషన్ నిధులపై ప్రశ్నలు
ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2730 కోట్లు కేటాయించామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అందులో కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని హరీష్ రావు ఆరోపించారు. ఈ కాలంలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. “మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజన యువతకు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలమైంది” అని ఆయన విమర్శించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి కూడా ఇదే సమాచారం వచ్చిందని తెలిపారు.
గిరిజనుల భూముల అంశంపై ఆరోపణలు
ఎస్సీ, ఎస్టీల భూములకు పట్టాలు ఇచ్చి వాటిని హక్కు భూములుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ మరోవైపు లగచర్లలో లంబాడీల భూములపై చర్యలకు దిగిందని హరీష్ రావు ఆరోపించారు. గిరిజనుల భూములకు పట్టాలు అందడం లేదని, కానీ వారి భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
