అప్పుల భారంతో దంపతుల ఆత్మహత్య

రూ.90 లక్షల రుణభారం..
ఇల్లు అమ్మినా తీరని అప్పులు
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు..
నిజామాబాద్‌లో విషాద ఘటన

నిజామాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. అప్పుల భారాన్ని తట్టుకోలేక విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు.

నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌ నగర్‌ కాలనీలో నివసిస్తున్న శేషాల నరేశ్‌ (35), ఆయన భార్య మేఘన (30) దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నరేశ్‌ విద్యుత్‌ శాఖలోని ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆశిష్‌, మిథున్‌ ఉన్నారు.

ఇల్లు కోసం చేసిన అప్పులు.. పెరిగిన ఆర్థిక భారం

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేశ్‌ దంపతులు కొన్ని నెలల క్రితం సొంత ఇల్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ.90 లక్షల వరకు అప్పులు చేశారు. ఇంటిపై రుణం వస్తే ఆ మొత్తంతో అప్పులు తీర్చుకోవచ్చని భావించారు. అయితే అనుకున్న విధంగా రుణం మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుల ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని విక్రయించి కొంత మొత్తాన్ని చెల్లించారు. అయినప్పటికీ మిగిలిన అప్పులు, ఆర్థిక సమస్యలు వారిని వెంటాడినట్లు తెలుస్తోంది.

మానసిక ఒత్తిడితో చికిత్స కూడా.. అయినా విషాదం

అప్పుల ఆందోళనతో నరేశ్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, కొంతకాలంగా మానసిక వైద్యుడి వద్ద చికిత్స కూడా పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో నరేశ్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. మేఘన పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఘటనపై మేఘన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్‌ నోట్‌, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అప్పుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అప్పులు సమస్యే.. ఆత్మహత్య పరిష్కారం కాదు

ఆర్థిక సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా ఆత్మహత్య పరిష్కారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారు వెంటనే సహాయం పొందాలని చెబుతున్నారు.