Sensex | మార్కెట్లకు మళ్లీ నష్టాల సెగ..!

నష్టాల్లో దేశీయ మార్కెట్లు..
సెన్సెక్స్‌ 127 పాయింట్లు డౌన్‌
ముడిచమురు ధరల పెరుగుదలతో ఒత్తిడి.. 24,500 దిగువకు నిఫ్టీ


Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ముడిచమురు ధరలు పెరగడం, పెట్టుబడిదారుల అప్రమత్తత కారణంగా సూచీలపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 24,428 వద్ద కొనసాగింది. మరోవైపు సెన్సెక్స్‌ 127 పాయింట్లు క్షీణించి 78,030 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 89.9 డాలర్లకు చేరడం ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమవుతోంది. ముడిచమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది.

అమెరికా మార్కెట్లలోనూ ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. గత సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.32 శాతం తగ్గగా.. నాస్‌డాక్‌ 0.6 శాతం నష్టపోయింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపైనా పడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌ దృష్టి అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలు, అమెరికా ఆర్థిక గణాంకాలపై ఉంది. సమీప కాలంలో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.