కడెం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవకాశం
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఈఈ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక
జన్నారం, కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు గేట్లను ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఉదయం ఆయన సూచించారు.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 700 అడుగుల వద్ద ఉందని ఈఈ తెలిపారు. ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 916 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కుడి, ఎడమ కాలువల ద్వారా 808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తే పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, జాలర్లు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
గోదావరి తీర ప్రజలకు హెచ్చరిక!
