ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ.. ఆసుపత్రి వద్ద ఆందోళన
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ గర్భిణీ మృతి చెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత (33), భర్త శ్రీశైలం. తొమ్మిది నెలల గర్భిణీ అయిన అనితను కుటుంబ సభ్యులు ఈ నెల 10న ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమెకు బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఫిట్స్ వచ్చాయని, అనంతరం మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే సమయానికి సరైన వైద్యం అందకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Sangareddy-government-hospital-pregnant-woman-dies
