కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా: సీఎం చంద్రబాబు
- కలిదిండిలో చంద్రబాబు ‘క్యాడర్ కనెక్ట్’..
- కార్యకర్తలతో సీఎం ఆత్మీయ మమేకం
కలిదిండి,ఆంధ్రప్రభ: కలిదిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సోమవారం నిర్వహించిన ‘క్యాడర్ కనెక్ట్’ కార్యక్రమంలో కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను తాను గమనిస్తున్నానని, కష్టపడిన వారందరినీ గుర్తుంచుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యకర్తలతో ఒక్కొక్కరిగా మాట్లాడటంతో పాటు వారితో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ సమస్యలు, పార్టీ కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యకర్తలకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు అందిస్తూ పార్టీ కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
కార్యకర్తే పార్టీకి ప్రధాన బలమని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరి కృషిని గుర్తిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల్లో పార్టీకి మరింత బలం చేకూరేలా పనిచేయాలని, అదే సమయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు.
కలిదిండిలో నిర్వహించిన క్యాడర్ సమావేశంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలతో ఫొటోలు దిగే కార్యక్రమంలో సుమారు 30 శాతం మంది పూర్తికాగా, మిగిలిన 70 శాతం మంది కార్యకర్తలతోనూ ఫొటోలు దిగేందుకు సీఎం కొనసాగించారు. ప్రతి కార్యకర్తను కలుసుకుని వారితో మాట్లాడాలన్న ముఖ్యమంత్రి ఆసక్తి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
“పార్టీ కోసం కష్టపడండి.. మీ కృషిని గుర్తిస్తా. ప్రతి ఒక్కరినీ గమనిస్తున్నా.. కష్టపడిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటా” అంటూ చంద్రబాబు కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దీంతో కలిదిండి వేదికగా జరిగిన క్యాడర్ కనెక్ట్ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.
