చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి
చంద్రబాబుకు ఎమ్మెల్యే రోషన్‌కుమార్ వినతి
చింతలపూడి, ఆంధ్రప్రభ: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయడంతో పాటు గోదావరి జలాలను ప్రతి ఎకరాకు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరారు. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగంగా ప్రారంభించి పూర్తి చేయాలని, తద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమైన రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, మూడు కీలక ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా నియోజకవర్గంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు, బాలికల కోసం రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు–మేడిశెట్టివారిపాలెం రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని, చింతలపూడిలో ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోషన్‌కుమార్ విజ్ఞప్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆయా అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
