డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి
తంగడపల్లిలో ‘యాంటీ డ్రగ్ అవేర్‌నెస్’ కార్యక్రమం
చౌటుప్పల్ ఆంధ్రప్రభ: మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్, ఎస్‌ఐ కె. యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరై గ్రామస్తులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ భవిష్యత్తును, ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, ఆర్థిక అనర్థాలను వివరించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రామంలో లేదా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా మత్తు పదార్థాలను విక్రయించినా, వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీసు సిబ్బంది, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
