ఇంటింటా జాతీయ జెండా.. ప్రతి గుండెలో దేశభక్తి..
ఆగస్టు 10 నుంచి 15 వరకు ‘అనే నేను’.. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలు
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి: కలెక్టర్ లక్ష్మీశ
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి ప్రజల భాగస్వామ్యం అవసరం
30 సెకన్ల వీడియోతో దేశం కోసం మన సంకల్పాన్ని చాటాలి
(విజయవాడ, ఆంధ్రప్రభ) : దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడినీ భాగస్వామిగా చేస్తూ, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు ప్రజల్లో బాధ్యత, దేశభక్తి, ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆగస్టు 10 నుంచి 15 వరకు ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్–అనే నేను’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘దేశం కోసం నేను.. నా వంతు కృషి చేస్తాను’ అనే సంకల్పంతో ప్రతి పౌరుడు దేశ నిర్మాణానికి తాను చేయగలిగే ఒక మంచి పనిని స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. దేశ అభివృద్ధి ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యం, బాధ్యత, కృషితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ దేశభక్తి, భవిష్యత్ లక్ష్యాలు, దేశ నిర్మాణంపై తమ ఆలోచనలను ప్రతిబింబించేలా 30 సెకన్ల ‘అనే నేను’ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని కోరారు. ఇందుకోసం స్వతంత్ర దినోత్సవ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ను ట్యాగ్ చేయాలని సూచించారు.
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటా జాతీయ జెండా రెపరెపలాడేలా చేసి ప్రతి ఇంటినీ జాతీయ స్ఫూర్తికి ప్రతీకగా నిలపాలని కోరారు.
విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం..
జిల్లాలోని పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను చురుకుగా భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. తమ భవిష్యత్ లక్ష్యాలు, దేశంపై ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో తాము చేయాలనుకుంటున్న కృషిని విద్యార్థులు వ్యక్తం చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. పంద్రాగస్టు వేడుకలను కేవలం ఉత్సవంగా కాకుండా దేశభక్తి, జాతీయ ఐక్యత, సామాజిక బాధ్యత, ప్రజా భాగస్వామ్యానికి వేదికగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతం చేయాలని, ‘దేశం కోసం నేను.. నా వంతు కృషి చేస్తాను’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
