జాతీయ ప్రాజెక్టు హోదా ప్రతిపాదన పరిశీలనలో లేదు
స్పష్టం చేసిన కేంద్రం
కృష్ణా జలాల వివాదం తేలే వరకు సాంకేతిక, ఆర్థిక పరిశీలన సాధ్యం కాదని వెల్లడి
సమగ్ర ప్రణాళికతో కొత్త డీపీఆర్ ఇవ్వాలని తెలంగాణకు సూచన
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కీలక సాగునీటి ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక పరిశీలన (టెక్నో ఎకనామిక్ అప్రైజల్)ను కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టలేమని వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు అందిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) ఆధారంగా పరిశీలనలు కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు.
కృష్ణా జలాల వివాదమే అడ్డంకి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్–2 (కేడబ్ల్యూడీటీ–2) పరిధిలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఈ అంశం న్యాయపరిధిలో ఉన్నందున (సబ్ జ్యుడీస్) ప్రాజెక్టుకు సంబంధించి టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
తిరిగి డీపీఆర్ ఇవ్వాలని సూచన
ప్రాజెక్టు ద్వారా ఆశించిన పూర్తి ప్రయోజనాలు సాధించేలా సమగ్ర ప్రణాళికతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాజెక్టు డీపీఆర్‌ను తిరిగి పంపినట్లు వెల్లడించింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
జాతీయ హోదాకు మార్గదర్శకాలు
సాధారణంగా జాతీయ ప్రాధాన్యం కలిగిన, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలతో సంబంధం ఉన్న, లేదా భారీ స్థాయిలో సాగునీటి సామర్థ్యాన్ని కల్పించే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన–ఏఐబీపీ మార్గదర్శకాల ప్రకారం జాతీయ హోదా కల్పిస్తారని కేంద్రం వివరించింది. కేంద్ర తాజా ప్రకటనతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్ర నిధుల అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. కృష్ణా జలాల వివాద పరిష్కారం, సమగ్ర ప్రణాళికతో కొత్త ప్రతిపాదనలు సమర్పించడం వంటి అంశాలపైనే ప్రాజెక్టు భవిష్యత్ ఆధారపడి ఉండనుంది.
