ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఘటన

కొణిజర్ల, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్న 8వ తరగతి విద్యార్థిని స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందిన అనంతరం మృతి చెందింది. కొణిజర్ల మండలం బస్వాపురంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న చల్లా హిమశ్రీ (14) మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

స్థానికుల సమాచారం ప్రకారం.. హిమశ్రీ ఆదివారం జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను స్థానికంగా వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఇంజెక్షన్‌ ఇచ్చిన అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆస్పత్రికి తరలించేలోపే..

బాలిక పరిస్థితి విషమించడంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం హిమశ్రీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

‘ఆర్‌ఎంపీదే కారణం’ అంటూ తండ్రి ఫిర్యాదు

తన కుమార్తెకు వైద్యం చేసే సమయంలో సంబంధిత ఆర్‌ఎంపీ మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంజెక్షన్‌ ఇచ్చిన తర్వాతే హిమశ్రీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని పేర్కొన్నారు. తన కుమార్తె మృతికి ఆర్‌ఎంపీనే కారణమంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఫిర్యాదు ఆధారంగా ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాలిక మృతికి ఖచ్చితమైన కారణాలు, వైద్యం సమయంలో ఏం జరిగిందన్న అంశాలపై దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.