వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు కోసమే మా పోరాటం

  • హౌస్ అరెస్టులు, అనుమతుల నిరాకరణతో ఉద్యమాన్ని ఆపలేరు..
  • వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్..
  • వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..

( విజయవాడ, ఆంధ్రప్రభ) : డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సిబిఐ విచారణ జరగాల్సిందే..

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణకు అప్పగించేందుకు ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయలేదని భావిస్తే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.

లోకేష్ రాజీనామా చేయాలి…

డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని దేవినేని అవినాష్ కోరారు. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం, తమపైకి కొందరిని ఉసిగొల్పడం సరికాదన్నారు. దేవినేని కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోందని, వ్యక్తిగత విమర్శలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు.

తమ పోరాటం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, వేలాది మంది డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తు కోసం అని అవినాష్ తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి రాకుండా ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హౌస్ అరెస్టులు, అనుమతుల నిరాకరణ, పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసినా పోరాటం ఆగదన్నారు.

ఈ పోరాటం ఆగదు..

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ తప్పు లేదని నమ్మితే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి నిరూపించుకోవాలని, లేనిపక్షంలో ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.