భక్తిశ్రద్ధలతో తాజుద్దీన్ బాబా ఛబ్బీస్ వేడుకలు..
చీమలపాడు ఏఏఎంటికే దర్బార్ షరీఫ్‌లో ఘనంగా నిర్వహణ
వందలాది మందికి అన్నదానం
ఎ.కొండూరు, ఆగస్టు 10 (ఆంధ్రప్రభ) : ఎ.కొండూరు మండలం చీమలపాడులోని ఏఏఎంటీకే దర్బార్ బాబె బొగ్దాద్ షరీఫ్‌లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో వేంచేసి ఉన్న హుజూర్ హజరత్ సర్కార్ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి ఛబ్బీస్ వేడుకలను ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.నఖీబుల్ ఔలియా,ఆషికే రసూల్ సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా ఆశీస్సులతో దర్బార్ పీఠాధిపతి, సజ్జదా నషీన్,పీర్జాద సూఫీ ముహమ్మద్ ఖాజా మొహిద్దీన్ షా తాజ్ ఖాదరీ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఉభయ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ప్రత్యేక ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి ఆశీస్సులు పొందారు. దర్బార్ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా పీఠాధిపతి ఖాజా మొహిద్దీన్ షా తాజ్ ఖాదర్ బాబా మాట్లాడుతూ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారు మానవత్వం, ప్రేమ, సేవ,సోదరభావాన్ని బోధించారని తెలిపారు.కుల, మతాలకతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా ఆదరించడం సూఫీ సంప్రదాయంలోని గొప్పతనమన్నారు. భక్తి మార్గంతో పాటు పేదలు, నిరుపేదలకు సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక తృప్తి లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ వేడుకల సందర్భంగా దర్బార్ నిర్వాహకుల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దర్బార్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు శిల్పి ఎండి జాఫర్ షరీఫ్, తాజ్ ఖాదర్ బాబు, కుమార్తె బొగదాద్, ఖాదర్షా, భక్తులు పాల్గొన్నారు.
