మోడీ విధానాలను తిప్పికొడదాం
జైల్‌భరో కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు బొట్ల చక్రపాణి పిలుపు
పరకాల, ఆంధ్రప్రభ: కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వంటి సంపద సృష్టికర్తలకు వ్యతిరేకంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు.
సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు పోలీస్‌స్టేషన్ ముందు అడ్డుకోవడంతో నాయకులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టికర్తలైన కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యజమానులకు కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పని గంటలను పెంచే విధానాలు కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్నాయని అన్నారు.
విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ సంస్కరణల బిల్లు, విత్తన చట్టం వల్ల కూడా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా వీబీజీ రామ్ బిల్లును రూపొందించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు సంపదను దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని చక్రపాణి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొచ్చు ఆదాం, పల్లె రామన్న, పి. సమ్మక్క, రమేష్, కమల్, చరణ్, రాజమౌళి, పి. రవి, సరోజన, తిరుమలతో పాటు సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.
