సీఎం పర్యటన విజయవంతం కావాలని వనదేవతలకు పూజలు చేసిన మంత్రి సీతక్క

మేడారం అభివృద్ధి పనుల పరిశీలన..

అధికారులకు పలు సూచనలు

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను మంత్రి దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆలయ పీటీ బీమ్స్, క్యూ లైన్లు, మీడియా టవర్లు, గ్రానైట్ పనులతో పాటు ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న నూతన క్యూ లైన్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈవో కార్యాలయ పరిసరాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ ఈవో, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.