ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
మేడారం అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ఈ నెల 16న ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని పీటీ బీమ్స్, క్యూ లైన్లు, మీడియా టవర్లు, గ్రానైట్ పనులతో పాటు ఆలయం వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న నూతన క్యూ లైన్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ఈవో కార్యాలయ పరిసరాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆలయ ఈవో వీరాస్వామి, పూజారులు కొక్కెర రమేష్, మండల మంకిడి నరసింహస్వామి, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
