జాతీయస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్టుకు ఎస్‌ఎస్‌కే విద్యార్థుల ఎంపిక..

అండర్‌–17 విభాగంలో ఎం. తుషిత, బి. అనిల్ ప్రతిభ


మైలవరం, ఆగస్టు 10 (ఆంధ్రప్రభ ) : బాపట్లలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లో మైలవరం ఎస్‌ఎస్‌కే పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. అండర్‌–17 విభాగంలో ఎస్‌ఎస్‌కే పాఠశాలకు చెందిన ఎం. తుషిత, బి. అనిల్ తమ ప్రతిభను చాటుకుని జాతీయస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి మోహనరావు మాట్లాడుతూ… తమ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు ఆటలలో రాణించేలా వ్యాయామ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, మైలవరం ప్రాంతానికి గర్వకారణమని తెలిపారు.

క్రీడలతో పాటు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల తరఫున నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ గొల్లపూడి భావన, ఉపాధ్యాయులు అభినందించి, జాతీయస్థాయిలోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.