554-Lakes-Water-Revolution : కుప్పం హ్యాపీ.. హ్యాపీ Andhra Prabha Top Story

554-Lakes-Water-Revolution : కుప్పం హ్యాపీ.. హ్యాపీ Andhra Prabha Top Story

  • క‌ర‌వు జిల్లాలో జ‌ల‌విప్ల‌వం
  • నెర్ర‌ల‌ నేలకు ప‌చ్చ‌ని శోభ‌
  • హంద్రీ నీవా నీటితో 554 చెరువులు గ‌ల‌గ‌ల‌..
  • పాతాళ గంగ‌మ్మ గంతులు
  • 200 నుండి 100 అడుగుల్లోనే నీళ్లు
  • సాగులోకి 10,915 ఎకరాల ఆయకట్టు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

554-Lakes-Water-Revolution : ఒకప్పుడు ఎండిన బావులు, బీడుబారిన పొలాలు, వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూసే రైతులు, తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచే ప్రజలు… ఇవన్నీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి గుర్తింపుగా ఉండేవి. రాయలసీమలోనే అత్యంత కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందిన కుప్పం నేడు పూర్తిగా రూపురేఖలు మార్చుకుంది. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు చేరడం, చెరువుల పునరుద్ధరణ, ఇన్-ఫ్లో కాలువల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ, శాస్త్రీయ జల యాజమాన్యంతో కుప్పం ఇప్పుడు సస్యశ్యామలంగా మారి జలవిప్లవానికి చిరునామాగా నిలుస్తోంది.

నియోజకవర్గంలోని మొత్తం 554 చెరువులు, కుంటలకు నీరు చేరి 400కు పైగా చెరువులు అలుగు పారుతున్నాయి.1.13 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. భూగర్భ జలాలు భారీగా పెరగడంతో ఒకప్పుడు 1000 అడుగుల లోతులో లభించని నీరు ఇప్పుడు 100 200 అడుగుల్లోనే అందుతోంది. 10,915 ఎకరాల చెరువుల ఆయకట్టు పూర్తిగా సాగులోకి రావడంతో రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి నాలుగు మండలాల్లో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందుతోంది. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పాడి పరిశ్రమ అభివృద్ధితో వలసలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడ) పరిధిలో చిన్న నీటిపారుదల విభాగం కింద మొత్తం 554 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1.13 టీఎంసీలు. ఇందులో 100 ఎకరాలకుపైగా ఆయకట్టు కలిగిన 20 ప్రధాన చెరువులు 0.38 టీఎంసీల సామర్థ్యాన్ని కలిగి ఉండగా, 534 చిన్న చెరువులు, కుంటలు 0.75 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం హంద్రీ-నీవా ద్వారా నీటి విడుదల, వర్షపు ప్రవాహాలను చెరువులకు మళ్లించే ఇన్-ఫ్లో కాలువలు సమర్థంగా పనిచేయడంతో 400కు పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతుండగా, మిగిలిన చెరువులు కూడా 70 శాతానికి పైగా నీటితో కళకళలాడుతున్నాయి.

కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల్లోని ప్రధాన చెరువులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న కుంటలు కూడా నీటితో నిండిపోవడంతో ప్రకృతి దృశ్యమే మారిపోయింది. ఒకప్పుడు ఎడారిని తలపించిన నేల ఇప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారి రైతులకు కొత్త ఆశలు నింపుతోంది. చెరువులు ఏడాది పొడవునా నీటితో నిండిపోవడం వల్ల భూగర్భ జలాల్లో గణనీయమైన మార్పు నమోదైంది. ఒకప్పుడు 800 నుంచి 1200 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు దొరకని పరిస్థితి ఉండేది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో 100 నుంచి 200 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తోంది. ఎండిపోయిన పాత బోర్లు, బావులు కూడా మళ్లీ నీటితో నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడ భూగర్భ జలాల గణాంకాల ప్రకారం నియోజకవర్గంలో 7.7 శాతం ప్రాంతంలో మూడు మీటర్ల లోపే భూగర్భ జలాలు, 15.4 శాతం ప్రాంతంలో 3 నుంచి 8 మీటర్ల మధ్య, 53.8 శాతం ప్రాంతంలో 8 నుంచి 20 మీటర్ల మధ్య నీటి మట్టం నమోదైంది. గతంలో 20 మీటర్లకంటే లోతులో మాత్రమే నీరు లభించే ప్రాంతాలు 40 శాతం దాటగా, ప్రస్తుతం అవి 23.1 శాతానికి తగ్గడం జల సంరక్షణ చర్యల విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రత్యేకించి గుడుపల్లె మండలంలోని కల్లివంక కాలువ పరివాహక ప్రాంతాలు, కుప్పం మండలంలోని బుడ్డగాని చెరువు, రాజాజీనగర్ ఛానల్ పరిసరాలు, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని పాలార్ నదీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు విశేషంగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వర్షాధార పంటలకు మాత్రమే పరిమితమైన రైతులు ఇప్పుడు వరి, చెరకు, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగును పెద్ద ఎత్తున చేపడుతున్నారు. బిందు, తుంపర సేద్య పద్ధతులను వినియోగిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు కూరగాయలు, పూలు, పండ్ల ఎగుమతులు పెరగడంతో రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. చెరువుల కింద మొత్తం 10,915 ఎకరాల ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగులోకి రావడం కుప్పం వ్యవసాయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.

గతంలో సగం కూడా సాగులో లేని భూములు ఇప్పుడు పూర్తిస్థాయిలో పంటలతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వేసవి వస్తే కుప్పం మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు చెరువుల్లో సమృద్ధిగా నీరు నిల్వ ఉండటం, రక్షిత మంచినీటి పథకాలు సమర్థంగా పనిచేయడంతో కుప్పం మున్సిపాలిటీలోని 25 వార్డుల ప్రజలతో పాటు నాలుగు మండలాల గ్రామాలకు ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందుతోంది. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో కూడా భూగర్భ జలాల నాణ్యత మెరుగుపడటంతో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఉపాధి కోసం బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు వలస వెళ్లిన అనేక కుటుంబాలు ఇప్పుడు తిరిగి స్వగ్రామాలకు చేరుకుని వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవన రంగాల్లో ఉపాధి పొందుతున్నాయి. పశుసంవర్ధక రంగం అభివృద్ధి చెందడంతో రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతోంది. కరువు, నీటి కొరత, వలసలు అనే గుర్తింపుతో ఉన్న కుప్పం నేడు జలసంపద, పచ్చదనం, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి ప్రతీకగా నిలవడం విశేషం. సరైన ప్రణాళిక, నీటి వనరుల శాస్త్రీయ నిర్వహణ, చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం కలిస్తే కరువు సీమను కూడా సుజలాంసుఫలాంగా మార్చవచ్చని కుప్పం నియోజకవర్గం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రాయలసీమలో జలవిప్లవానికి నాంది పలికిన ఈ మార్పు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక నమూనాగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.