సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు షాక్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం (నల్సార్‌) 2026 స్నాతకోత్సవ వేడుకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే అంశంపై విద్యార్థుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యే నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌లకు విద్యార్థులు లేఖ రాశారు.

2025-26 బ్యాచ్‌కు చెందిన దాదాపు 450 మంది న్యాయ విద్యార్థులు ఈ నిర్ణయంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. న్యాయ విద్య పూర్తిచేసుకున్న విద్యార్థుల స్నాతకోత్సవానికి జస్టిస్‌ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీలో జులై 20 నుంచి జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలు, అనంతరం పార్లమెంట్‌ ముట్టడి సమయంలో విద్యార్థులపై పోలీసుల చర్యల అంశాన్ని విద్యార్థులు ప్రస్తావించారు. జులై 23న ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, పోలీసు చర్యలకు సంబంధించిన వీడియోలను పరిశీలించేందుకు సీజేఐ నిరాకరించారని, దీనిపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే గతంలో నిరుద్యోగులను ఉద్దేశించి చేసినట్లు ఆరోపణలు వచ్చిన “బొద్దింకలు” వ్యాఖ్యలను కూడా విద్యార్థులు ప్రస్తావించారు.

“న్యాయశాస్త్ర విద్యార్థులుగా రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, సమస్యలపై హేతుబద్ధమైన చర్చలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా స్నాతకోత్సవం ఉండాలని కోరుకుంటున్నాం” అని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు.

కాన్వొకేషన్‌ తేదీ, ముఖ్య అతిథి ఎంపిక ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, అందువల్ల ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని కోరారు. తమ అభ్యంతరం కేవలం 2025-26 బ్యాచ్‌ స్నాతకోత్సవానికి సంబంధించినదేనని విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. జస్టిస్‌ సూర్యకాంత్‌పై గతంలో వచ్చిన కొన్ని వ్యాఖ్యల వివాదాలు, తాజాగా విద్యార్థుల నిరసనలు నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో ఆయన హాజరుపై చర్చ జరుగుతోంది. అయితే ఆయా వ్యాఖ్యలపై సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ, కొంతమంది విద్యార్థుల్లో అసంతృప్తి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.