రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్..
సత్ప్రవర్తనతో మెలగాలని సూచన
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు సూచించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగించాలని హితవు పలికారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
