ప్రాజెక్టులో 44,279 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
181.05 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
శ్రీశైలం, ఆంధ్రప్రభ: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువ నుంచి 44,279 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇందులో జూరాల ప్రాజెక్టు నుంచి 44,279 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. సుంకేసుల, హంద్రీ, జలాశయ పరివాహక ప్రాంతాల నుంచి ప్రవాహం లేదు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. జలాశయం స్థూల నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.059 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
1.01 లక్షల క్యూసెక్కుల తక్షణ ప్రవాహం..
జలాశయానికి తక్షణంగా నమోదైన వాస్తవ వరద ప్రవాహం 1,01,384 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నుంచి మొత్తం 17,463 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవా సుజల స్రవంతి మల్యాల ద్వారా 2,500 క్యూసెక్కులు, ముచ్చుమర్రి కుడి కాలువ ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యుదుత్పత్తి ద్వారా 4,563 క్యూసెక్కులు..
శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 4,563 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల లేదు. మొత్తం కాలువల ద్వారా 12,900 క్యూసెక్కుల నీటి విడుదల నమోదైంది. స్పిల్‌వే ద్వారా నీటి విడుదల లేదు. ఫేజ్-2 పంపింగ్ విధానంలోనూ నీటి తరలింపు జరగడం లేదు.
