భారతీయ సంస్కృతిలో గోరింటాకు ఒక భాగం

  • పార్వతీదేవి రుధిరాంశే గోరింటా
  • అలంకరణలో అగ్రపీఠం గోరింట దే
  • అలంకరణకే కాదు ఔషధ గుణాలున్న జీవన మూలిక

ఏలూరు కల్చరల్, ఆంధ్రప్రభ: పండగైనా, పబ్బమైనా, ఏ వేడుకైనా.. ముఖ్యంగా ఆషాఢంలో అమ్మాయిల అరచేతుల్లో గోరింటాకు పడాల్సిందే. వరలక్ష్మీ వ్రతం, అట్లతద్ది పండుగల సమయంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు. ఒకప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే ఎంత శ్రమ పడేవారో పెద్దవాళ్లను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గోరింటాకు దొరుకుతోంది. కానీ పూర్వం అయితే కొద్దిమంది ఇళ్ల పెరళ్లలో మాత్రమే గోరింటాకు చెట్లు ఉండేవి.

ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు వచ్చాయి. కానీ అప్పట్లో గోరింటాకు కోసుకుని వచ్చాక రోట్లో రుబ్బి చేతులకు పెట్టుకునేవారు. అది పెట్టుకున్నాక ఎర్రగా పండాలంటే కదలకుండా ఓపిగ్గా కొన్ని గంటలు కూర్చోవాలి. గోరింట పండిన చేతుల అందం, దాని సువాసన మరేదేనిలోనూ లేవు. అలంకరణలో అగ్రపీఠం ఎప్పటికీ గోరింటదే.

పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు కాలగర్భంలో కలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో.. అరచేతిలో దొండపండు వంటి ఎర్రని మెరుపులను మెరిపించే గోరింట మాత్రం అతివల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మన దేశంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు గోరింటాకు పెట్టుకుంటారు. ప్రతి భారతీయ వధువుకు వివాహానికి ఒక రోజు ముందు గోరింటాకు పెడతారు. పెళ్లికి వచ్చిన మహిళలు కూడా దీనిని పెట్టుకుంటారు.

కన్నెపిల్ల చెయ్యి బాగా పండితే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన స్త్రీ చెయ్యి బాగా పండితే వారి వైవాహిక జీవితం అన్యోన్యంగా, ఆనందభరితంగా సాగుతుందని నమ్మకం.

“మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు…
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు”

అంటూ అరచేతిలో పండిన గోరింట రంగును పొగుడుతూ అమ్మాయిలందరూ పాటలు అందుకుంటారు. ఈ పాటలో యథార్థం ఎంత ఉన్నా.. అరచేతిలో పూసిన ఎర్రని గోరింట మాత్రం మగువలను అందంగా మెరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆనందింపజేస్తుంది.

అన్నింటిలో ఆధునిక పోకడలు చోటుచేసుకుంటున్నట్టే గోరింటాకు పెట్టుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. పూర్వం గోరింటాకు కోసుకుని వచ్చి అందులో కాస్త చింతపండు, కొంచెం కాసు వేసి రుబ్బి పెట్టుకునేవారు. ఇప్పుడు గోరింటాకు పొడిని పేస్ట్‌లా చేసి కోన్లలో నింపి అమ్ముతున్నారు. నచ్చిన డిజైన్లను సులువుగా వేసుకోవచ్చు. అయితే ఆకులను నూరి పెట్టుకుంటే వచ్చే నాణ్యమైన మంచి రంగు కోన్లతో రాదు. 17వ శతాబ్దంలో గోరింట వాడకం సమున్నత స్థానానికి చేరుకుందని చరిత్రకారులు చెబుతున్నారు.

పార్వతీదేవి రుధిరాంశంతో జన్మించిన గోరింటాకు

దీనికి సంబంధించి పురాణాల్లో ఒక కథ చెప్పబడింది. గౌరీదేవి బాల్యంలో వనంలో చెలికత్తెలతో ఆడుకుంటుండగా రజస్వల అయ్యింది. అప్పుడు రక్తపు చుక్క నేలపై పడింది. వెంటనే అక్కడ ఒక మొక్క మొలిచింది. చెలికత్తెలు ఈ వింతను పార్వతీదేవి తండ్రి హిమవంతునికి చెప్పడంతో ఆయన సతీసమేతంగా అక్కడకు వస్తారు. అంతలోనే ఆ మొక్క పెద్ద వృక్షంగా మారింది.

తన వల్ల లోకానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుందని ఆ చెట్టు గౌరీదేవిని అడుగుతుంది. ఇంతలో బాల్యచాపల్యంతో గౌరీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి. ఇది చూసిన ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా.. తనకేమీ బాధ కలగలేదని, చేతులు అందంగా కూడా ఉన్నాయని ఆమె చెబుతుంది.

దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ఈ చెట్టు ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదిస్తారు. అంతేకాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరుమీద ఆ వృక్షాన్ని ‘గౌరింటాకు’ అని పిలిచేవారు. కాలక్రమేణా అది చేతులకు అలంకారంగా పెట్టుకోవడంతో ‘గోరింటాకు’గా మారిపోయింది.

ఇది కాళ్లు, చేతులకు అలంకారంగా ఉపయోగపడుతుంది కనుక ఆ వృక్షానికి అదే సార్థకత అని గౌరీదేవి వరమిచ్చిందని కథనం. దీంతో అప్పటి నుంచి ప్రజలు ఆ చెట్టు ఆకుల పసరుతో కాళ్లు, చేతులను అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు.

అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగింది. నుదుటన కూడా ఈ ఆకుపసరుతోనే బొట్టు పెట్టుకుంటే తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందేమోనని భయపడింది. ఈ విషయాన్ని గౌరీదేవికి చెప్పగా.. గోరింటాకును నుదుటన పెట్టుకుంటే పండదని ఆమె అభయమిచ్చిందట.

గోరింటాకు కేవలం అలంకారానికే కాకుండా.. అందులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. గోరింటాకును సంస్కృతంలో ‘నఖరంజన’ అని, ఆంగ్లంలో ‘హెన్నా’ అని, హిందీలో ‘మెహందీ’ అని పేర్కొంటారు.