కైకలూరు సంత మార్కెట్ వద్ద మురుగునీటి ప్రవాహం
- రోడ్డుపైనే మురుగు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
కైకలూరు టౌన్, ఆంధ్రప్రభ: కైకలూరు పట్టణంలోని సంత మార్కెట్ వద్ద మురుగునీరు రహదారిపైకి పొంగిపొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు.
మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో మురుగునీరు చుట్టుపక్కలకు చిమ్ముతూ కాలినడకన వెళ్లే వారిపై పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు సమస్య మరింత తీవ్రంగా మారుతోందని పేర్కొంటున్నారు.
సంత మార్కెట్ ప్రాంతంలో నిత్యం వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతుండటంతో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రధాన ప్రాంతంలో మురుగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
