గ్రామ వ్యవసాయ సహాయకులపై పనిభారం తగ్గించాలి..
- ఖరీఫ్ సీజన్‌లో ఏకకాలంలో పలు బాధ్యతలు అప్పగించడం సరికాదు
- వ్యవసాయేతర శాఖల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి
(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ)పై పెరుగుతున్న పనిభారాన్ని తక్షణమే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహాయకుల సంక్షేమ సంఘం (ఏపీవీఏఏడబ్ల్యూఏ) రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
విజయవాడలోని ఏపీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ (ఏపీఏఓ) అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఏఏలకు ఒకేసారి పలు బాధ్యతలు అప్పగించడం వల్ల క్షేత్రస్థాయిలో నిర్దేశిత సమయంలో విధులను పూర్తి చేయడం ఇబ్బందికరంగా మారుతోందని అన్నారు.
ఈ-క్రాప్ (ఈ-పంట), ఎరువుల పంపిణీ, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏపీఏఐఎంఎస్), ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలోని ప్రత్యేక కార్యకలాపాలు తదితర బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. అదనపు బాధ్యతల కారణంగా క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
పనిభారం, వరుసగా అప్పగిస్తున్న అదనపు విధుల కారణంగా మహిళా వీఏఏలు, దివ్యాంగ ఉద్యోగులు ప్రత్యేకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామ్ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం వీఏఏలకు కేటాయిస్తున్న విధులను సమీక్షించి, పనిభారాన్ని హేతుబద్ధీకరించాలని కోరారు.
తమ మాతృశాఖ అయిన వ్యవసాయ శాఖకు సంబంధించిన విధులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేలా, ఇతర శాఖలకు సంబంధించిన విధులు, అంశాల నుంచి వీఏఏలను మినహాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలను సమర్థవంతంగా అందించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
వీఏఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పనిభారాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సమావేశంలో పాల్గొని క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు టి. కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక్, ప్రచార కార్యదర్శి నరేంద్రతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
