విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించండి
- వరంగల్ ఎంపీ కడియం కావ్యకు రిటైర్డ్ ఉద్యోగుల వినతి
తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని కోరుతూ తొర్రూరు మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఆదివారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో సంఘం మండల అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించింది. అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నూరు కోటయ్య, దీకొండ వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి బోడ బాలాజీ, గట్టు సోమయ్య తదితరులు ఈ బృందంలో పాల్గొన్నారు.
తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సౌకర్యార్థం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వారు ఎంపీని కోరారు. అలాగే సబ్ ట్రెజరీ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిర్మించిన విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన అభివృద్ధి పనులకు కూడా సహకరించాలని ఎంపీ కడియం కావ్యను కోరారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
