సీఎం పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు..

కలిదిండి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా, కలిదిండి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ, కేటాయించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ బందోబస్తు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, గ్యాలరీలు, ప్రవేశ మార్గాలు, కాన్వాయ్ రూట్, రూఫ్‌టాప్‌లు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు.

గ్యాలరీలు, సభా వేదిక వద్దకు వచ్చే వారిని బీడీ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతించాలని, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు. వైర్‌లెస్ ద్వారా అధికారులు సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని, విధుల్లో అలసత్వం లేదా గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వై. ప్రసాద్ రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, కైకలూరు టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, రూరల్ ఇన్‌స్పెక్టర్ వి. రవికుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.