సంఘటితంతోనే హక్కులు సాధించుకుందాం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదివాసీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం సంఘటితంగా, శాంతియుతంగా పోరాటాలు సాగించాలని ఎంపీ నగేష్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లోని పీఎంఆర్సీలో నిర్వహించిన సభలో ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అందరూ సమిష్టిగా ముందుకు సాగాలని అన్నారు. జీవో నంబర్ 3 సాధన కోసం ఎమ్మెల్యేలంతా కలిసి కృషి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా బీటీ రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం సంఘటితంగా శాంతియుత పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యత లేకపోతే ఆదివాసీల మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. పోడు భూములు, అటవీ హక్కుల విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం సమిష్టిగా పోరాటం కొనసాగిస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు అయ్యే వరకు విశ్రమించేది లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తోందని, త్వరలోనే రాయి సెంటర్ల భవనాల నిర్మాణానికి అనుమతులు వస్తాయని పేర్కొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరి సహకారం అవసరమని తెలిపారు. ఆదివాసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఐటీడీఏ పీవో గోండి, కొలామి భాషల్లో ప్రసంగించి ఆదివాసీలను ఆకట్టుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. ఆదివాసీలతో పోలీస్ శాఖకు సత్సంబంధాలు ఉన్నాయని, వారి అభివృద్ధి, యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పోలీస్ శాఖకు ఆదివాసీలు సహకరించాలని కోరారు.
ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. అటవీ అధికారుల దాడులను సహించేది లేదని, హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే, కలెక్టర్, పీవో, ఎస్పీ తదితరులు సన్మానించారు.
కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, నాయకులు హాజరుకావడంతో ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
