ఆర్టీసీ ఉద్యోగుల మనుగడే సంస్థ మనుగడ..

  • న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్‌ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. ప్రస్తుతం మూడో దశలో చేపడుతున్న ఉద్యమంతో పాటు భవిష్యత్‌ కార్యక్రమాలకు కూడా మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు.

ఈ మేరకు ఆదివారం ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ. విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణను ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి మద్దతు కోరారు. గత రెండు నెలలుగా చేపట్టిన ఉద్యమాలు, ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టడాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయని తెలిపారు. అయితే విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నడపాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పాటు ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదన్న భరోసాను ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మంచి పేరు తీసుకురావడంలో ‘స్త్రీ శక్తి’ వెనుక ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఉద్యోగుల మనుగడ, ఆర్టీసీ మనుగడ వేర్వేరు అంశాలు కావని, ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించకుండా ఆర్టీసీని బలోపేతం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఆర్టీసీ జేఏసీ చేపట్టబోయే ఉద్యమాలకు, భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యక్రమాలకు కూడా ఏపీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని విద్యాసాగర్‌ తెలిపారు.

కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, సి.హెచ్‌. సుందరయ్య, ఎస్‌.వి. శేషగిరిరావు, వై. శ్రీనివాసరావుతో పాటు జేఏసీ నాయకులు ఎం.డి. ప్రసాద్‌, ఆర్‌. సుబ్బారావు, ఎస్‌. రాజేష్‌కుమార్‌, ఎం. శంకరరావు తదితరులు పాల్గొన్నారు.