పార్టీ బలోపేతం.. ప్రజా సేవకు కొత్త వేదిక

  • నూతన హంగులతో ఆనం క్యాంప్‌ కార్యాలయం
  • పార్టీ సమావేశాలు, సమీక్షలకు అధునాతన కాన్ఫరెన్స్‌ హాల్‌
  • పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌

నెల్లూరు, ఆంధ్రప్రభ: నెల్లూరు సంతపేటలోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్యాంప్‌ కార్యాలయం నూతన హంగులతో ముస్తాబైంది. పార్టీ సమావేశాలు, సమీక్షలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధునాతన కాన్ఫరెన్స్‌ హాల్‌ను కాకర్ల సురేష్‌ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న ఆయన.. క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధునాతన కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి, వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు.

పార్టీ శ్రేణులకు మరింత అందుబాటులో ఉండేలా, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయానికి వేదికగా నిలిచేలా క్యాంప్‌ కార్యాలయాన్ని రూపొందించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ కార్యక్రమాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఇలాంటి వేదికలు దోహదపడతాయని కాకర్ల సురేష్‌ తెలిపారు.