చిత్రాల్లో వెల్లివిరిసిన దేశభక్తి స్ఫూర్తి..
- త్రివర్ణ పతాకం.. జాతీయ నాయకుల చిత్రాలతో ఆకట్టుకున్న చిన్నారులు
- విద్యార్థుల్లో జాతీయ భావన, సృజనాత్మకతను పెంపొందించాలి
- చిన్నారుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు అభినందనీయం
- జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
(విజయవాడ, ఆంధ్రప్రభ) : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రైట్ మైండ్స్ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ వాణిజ్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని బాపు మ్యూజియం వేదికగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై చిత్రలేఖనం పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి, వారు రూపొందిస్తున్న చిత్రాలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, సృజనాత్మకతను పెంపొందించడంలో కళలు, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు తమలోని సృజనాత్మక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను చిత్రాల రూపంలో వ్యక్తీకరించడం ద్వారా విద్యార్థుల్లో జాతీయ భావన మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం, జాతీయ నాయకులు, స్వాతంత్ర్య స్ఫూర్తి తదితర అంశాలను చిత్రాల ద్వారా ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తగిన వేదిక కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సృజనాత్మక ఆలోచనా శక్తికి పదును పెడతాయని తెలిపారు. విద్యార్థులు తమ అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ చిత్రలేఖనం పోటీల్లో సుమారు 250 మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ నాయకులు, త్రివర్ణ పతాకం తదితర అంశాలను ప్రతిబింబించే చిత్రాలను విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఆవిష్కరించారు. విద్యార్థుల వయస్సు, ప్రతిభను దృష్టిలో ఉంచుకుని చిత్రలేఖనం పోటీలను నాలుగు గ్రూపులుగా నిర్వహించారు.
ప్రతి విభాగంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీయడంతో పాటు, వారి సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులు షర్మోక్ స్కూల్ రిచి సిద్ధార్థ, శ్రీ ధృతి, బి అభినయ్, స్కంద సెయింట్ జాన్ స్కూల్ తన్మయ చైత్ర దన్వి, ఎన్.ఎస్.ఎం స్కూల్ ఆరాధ్య, నెక్స్ట్ జెన్ స్కూల్ వైష్ణయ, యుపిఎస్ నిక్షిత , సెయింట్ థెరిస్సా రెబిక జాయ్స్ , సెయింట్ థెరీసా మిదిలేష్, ఆర్.సి.ఎం స్కూల్ రియా, నాగ కార్తిక, దియ శ్రీ, తదితరులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ లయన్ వై.ఎస్. బాబు, బాపు మ్యూజియం కమిషనర్ సురేష్ బాబు, ఠాగూర్ స్మారక గ్రంథాలయ అధికారిణి కె.రమాదేవి, యుపిపిఎస్ ఫ్యాకల్టీ చంద్రిక, లయన్స్ క్లబ్ ఆఫ్ వాణిజ్య విభాగం ప్రతినిధులు శ్రీమన్నారాయణ, ప్రభు, పూర్ణిమ తదితరులు విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
