బ్యారేజ్‌పై ఆగి మరీ గోదావరి జలాల పరిశీలన!
- పట్టిసీమతో 17.52 టీఎంసీల గోదావరి జలాల తరలింపు
- పట్టిసీమ నీటితో డెల్టాకు జలకళ
- డెల్టా కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటి విడుదల
- ఎల్‌నినో పరిస్థితుల్లోనూ సాగుకు నీటి భరోసా
- నీటి నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు
అమరావతి, ఆంధ్రప్రభ: ప్రకాశం బ్యారేజ్‌లో నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి వస్తున్న గోదావరి జలాలను ఆయన తిలకించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి తన నివాసానికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్‌పై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్‌ను నిలిపిన సీఎం.. నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్‌ను పరిశీలించారు.
ప్రకాశం బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువలకు నీటి సరఫరాను కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ప్రస్తుతం కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్‌కు 115 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డెల్టా ప్రాంతానికి నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.
ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు డెల్టా ప్రాంతంలోని పంటలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్‌నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

