పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ: అచ్చెన్నాయుడు

టెక్కలిలో 44 మందికి రూ.22.83 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
టెక్కలిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ: ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్ భవన్‌లో 44 మంది లబ్ధిదారులకు రూ.22.83 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 441 మందికి రూ.4.83 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వైద్య తదితర అత్యవసర అవసరాల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

రూ.640 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు

టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. రూ.640 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే, రూ.350 కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. నేరడి బ్యారేజీ పనులను కూడా వేగవంతం చేసి టెక్కలిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

80 శాతం రహదారి పనులు పూర్తి

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం రహదారి పనులు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. మిగిలిన 20 శాతం రహదారుల కోసం సీసీ, తారు రోడ్ల నిర్మాణానికి మరో రూ.350 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.

99 శాతం హామీలు అమలు

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలతో పాటు 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్‌ను రూ.4,000కు పెంచామని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా వంటి పథకాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన..

ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని కోరారు.

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది..

ప్రజల కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అచ్చన్నాయుడు భరోసా ఇచ్చారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టెక్కలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.